రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉప-ఎన్నికల బరిలో నిలుస్తూ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. తన పేరిట మొత్తం రూ. 96 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పీకే ప్రకటించగా, అందులో రూ. 22.19 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 73.87 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రశాంత్ కిశోర్ కంటే ఆయన భార్య పేరిట మరిన్ని ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ఈ అఫిడవిట్ ద్వారా బహిర్గతమైంది.
అసోం రాష్ట్రానికి చెందిన వైద్యురాలైన ప్రశాంత్ కిశోర్ భార్య జాహ్నవి దాస్ పేరిట మొత్తం రూ. 101.73 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఇందులో అత్యధికంగా రూ. 89.51 కోట్లు చరాస్తుల రూపంలో ఉండగా, రూ. 12.42 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆస్తుల వివరాలతో పాటు తనకు బ్యాంకులలో రూ. 5.77 కోట్ల మేర రుణం (అప్పు) ఉన్నట్లు కూడా పీకే పేర్కొన్నారు. అలాగే లక్నో యూనివర్సిటీ నుంచి బీబీఏ, హైదరాబాద్‌లోని ఏఎస్సీఐ (ASCI) నుంచి మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ పూర్తి చేసినట్లు తన విద్యార్హతలను అఫిడవిట్లో పొందుపరిచారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ స్థానం నుండి ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, పీకే సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై పరువు నష్టం, మోసం, అధికార విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయని, అయితే వీటిలో దేనిలోనూ ఇంకా కోర్టులో అభియోగాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.









