టీ-హబ్ బేబీ ‘స్కైరూట్’ చరిత్ర సృష్టించింది: యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ హర్షం

హైదరాబాద్‌ సరూర్‌నగర్ వేదికగా జరిగిన ‘యువ సంగ్రామ సదస్సు’లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలిసారిగా శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంపై ఆయన తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత రికార్డు సృష్టించిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ మరెక్కడో కాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ‘టీ-హబ్’ (T-Hub) వేదికగానే పురుడు పోసుకుందని సభలో గర్వంగా ప్రకటించారు.

భారతదేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఒక ప్రైవేట్‌ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన ఘనత స్కైరూట్ కంపెనీకే దక్కుతుందని కేటీఆర్ కొనియాడారు. మన హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా ఒక చిన్న స్టార్టప్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ఈ సంస్థ, ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా ఎదగడం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన స్కైరూట్‌ టీమ్‌కు సభకు హాజరైన నిరుద్యోగ యువత, విద్యార్థులంతా చప్పట్లతో ఘనంగా అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ (ISRO) సహకారంతో ప్రైవేట్ రంగానికి చెందిన తొలి దేశీయ రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యూరిస్తున్నాయి. ఈ విజయంతో అటు ఇస్రో సైంటిస్టులతో పాటు ఇటు స్కైరూట్ కంట్రోల్ సెంటర్‌లోనూ పండుగ వాతావరణం నెలకొందని, తెలంగాణ గడ్డపై పుట్టిన స్టార్టప్ గ్లోబల్ లెవెల్‌లో రాణించడం రాష్ట్రానికే గర్వకారణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు