చదువుతోనే పేదరికాన్ని జయించవచ్చని, నిరంతర కష్టపడే తత్వంతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలో సోమవారం (జూలై 20) జరిగిన ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్ – 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, మరియు నగదు బహుమతులను అందజేసిన మంత్రి, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకుంటూ.. తాను విద్యార్థి దశలో పదో తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు వెల్లడించారు. అయితే ఆ వైఫల్యమే తనలో పట్టుదలను పెంచిందని, ఆ కసితోనే అనంతరం డిగ్రీలో యూనివర్శిటీ టాపర్‌గా నిలిచి స్టాటిస్టిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించానని గుర్తుచేసుకున్నారు. ప్రారంభంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా, కష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరని విద్యార్థులకు సూచించారు.
తన చదువు పూర్తయ్యాక వీఆర్సీలో కేవలం రూ.40 జీతానికి పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశానని, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా రాజీనామా చేసి, సొంతంగా ట్యూషన్లు చెబుతూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కొనియాడారు. విద్యార్థులంతా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ నూతన మార్పులను, అందివస్తున్న అత్యాధునిక అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.









