ఓడలరేవు బీచ్‌లో విషాదం: సముద్రంలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకుల మృతి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం (జూలై 19) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరానికి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు అలల ఉద్ధృతికి గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు పిక్నిక్ కోసం బీచ్‌కు వెళ్లగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

మృతులను అరవింద్ (23), శ్రీరామ్ (17), మంచిల సాయిగా పోలీసులు గుర్తించారు. వీరిలో అరవింద్, శ్రీరామ్, సాయి సరదాగా సముద్రంలో స్నానానికి దిగగా, ఒక్కసారిగా వచ్చిన భారీ అలల తాకిడికి అదుపుతప్పి లోపలికి కొట్టుకుపోయారు. యువకులు గల్లంతవ్వడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో తొలుత అరవింద్, శ్రీరామ్ మృతదేహాలు లభ్యం కాగా, ఆ తర్వాత సాయి మృతదేహాన్ని కూడా వెలికితీశారు.

చదువులు, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఈ యువకులు, ఇటీవలే సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చి ఇలా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడంతో మాచవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సముద్ర తీరాల్లో పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు