కొత్త ఆలోచనలు, వినూత్న కథలతో వచ్చే చిన్న సినిమాలకు ప్రేక్షకులు, మీడియా నుంచి మరింత ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. అలాంటి చిత్రాలకు సరైన గుర్తింపు దక్కితే తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ‘అదిరే అభి’ (అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు లభించే మద్దతు కాస్త తక్కువే అయినప్పటికీ, నిజమైన దమ్ము, కొత్తదనం, బలమైన కథలు చిన్న సినిమాల్లోనే ఉంటాయని విజయశాంతి పేర్కొన్నారు. ప్రేక్షకులు ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలను ఆదరిస్తే పరిశ్రమకు మరింత మంది కొత్త నటీనటులు, దర్శకులు వస్తారని అన్నారు. ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలు నిలదొక్కుకోవాలంటే మీడియా సహకారం చాలా అవసరమని, కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో మీడియానే కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
‘కర్మాఖ్య’ సినిమాలో నటించిన అభినయ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ… ఈ పాత్ర కోసం ఆమె గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదని, కానీ కథపై ఉన్న అంకితభావంతోనే అలా చేశారని విజయశాంతి అభినందించారు. ఇక తన నటన కెరీర్ పై స్పందిస్తూ… ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నందున నటించే ఆలోచన లేదని, అయితే గుర్తుండిపోయే మంచి పాత్ర వస్తే మాత్రం ఆలోచిస్తానని వెల్లడించారు. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ‘కర్మాఖ్య’ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది.









