వైసీపీపై నిప్పులు.. అధికారులకు క్లాస్.. ఆలూరులో చంద్రబాబు ఫైర్..

ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలనలో నిర్లక్ష్యానికి, అలసత్వానికి చోటు లేదని గట్టిగా హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆలూరులో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పాటు, ప్రభుత్వ అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా అయినా, ప్రజలకు సేవలు అందడంలో జాప్యం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు.

 

ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

గత ఐదేళ్ల పాలనలో రాయలసీమకు చేసిందేమీ లేదని, తాము రెండేళ్లలోనే ఇరిగేషన్‌పై రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే, వారు ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

 

“బాబాయిని గొడ్డలితో లేపేసి, ఆ కేసును మా మీదకు నెట్టి సానుభూతితో ఓట్లు సంపాదించుకోవాలని చూశారు. ఇకపై అలాంటి నీచ రాజకీయాలు సాగవు. రౌడీయిజం చేసే వారిని, ఆడబిడ్డల జోలికి వచ్చేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శాంతిభద్రతల పరిరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది” అని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవని, తమ పాలనలో శాంతిని నెలకొల్పామని గుర్తుచేశారు.

 

అధికారుల పనితీరుపై అసహనం

అనంతరం, నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, సేవల అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 42 రకాల సేవలపై తన వద్ద ఉన్న డేటాను ప్రస్తావిస్తూ, పలువురు అధికారుల పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. అన్న క్యాంటీన్ నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్లపై గుంతలు, రీసర్వే, మధ్యాహ్న భోజనం, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వంటి అంశాల్లో ఆలూరు నియోజకవర్గం వెనుకబడి ఉందని గణాంకాలతో సహా వివరించారు.

 

తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంపై సంబంధిత అధికారిని నిలదీసిన సీఎం, “మీ పరిస్థితి బాగాలేదు. మళ్లీ వస్తా.. పరిస్థితి మారకపోతే చాలా సీరియస్‌గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టండి, కానీ ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందే” అని ఆదేశించారు.

 

ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా సరిగా లేవన్న ఫిర్యాదులపై స్పందిస్తూ, “మీరు ఆంధ్రాలో ఉన్నారో, కర్ణాటకలో ఉన్నారో అర్థం కావడం లేదు. నెల రోజుల్లో పరిస్థితి మారకపోతే మీ కథ వేరేగా ఉంటుంది” అని ఆర్టీసీ అధికారికి వార్నింగ్ ఇచ్చారు.

 

తాను ఇంత కష్టపడుతుంటే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే, గిరిజన సంక్షేమ హాస్టళ్లు, శాప్ వంటి కొన్ని శాఖల పనితీరును ప్రశంసించడం గమనార్హం. ప్రజలకు మెరుగైన పాలన అందించే వరకు తన పోరాటం ఆగదని చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు