వెంకీ-త్రివిక్రమ్ ‘ఆద‌ర్శ కుటుంబం’లో నారా రోహిత్..!

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంపై ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో డైనమిక్ యాక్టర్ నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో.. “డైనమిక్ నారా రోహిత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. #AK47 ప్రాజెక్టులోకి మీకు స్వాగతం పలుకుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాం” అని పోస్ట్ చేసింది. విడుదల చేసిన పోస్టర్‌లో నారా రోహిత్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే, ఆయన ఈ చిత్రంలో ఒక పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK 47’ అనే వినూత్నమైన టైటిల్‌ను గత ఏడాది డిసెంబర్‌లో ఖరారు చేశారు. అప్పట్లో విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో వెంకటేశ్‌ రోడ్డు మధ్యలో చిరునవ్వుతో నిలబడి ఉన్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేశ్‌ ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా ఇప్పుడు తన ఫేవరెట్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్‌తో జత కట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న పూర్తిస్థాయి చిత్రం ఇదే మొదటిది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాకపోయినా వెంకటేశ్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఆ సినిమా విజయంలో ఆయన సంభాషణలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు నేరుగా ఆయన దర్శకత్వంలోనే సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.

 

గత ఏడాది ఆగస్టులో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగ్గా, ఈ బుధవారం నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. నారా రోహిత్ చేరికతో సినిమా తారాగణం మరింత బలంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు