కూరగాయల వ్యాపారి కొడుకు అద్భుతం.. కామన్వెల్త్‌లో భారత్‌కు తొలి మెడల్..

కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత్ పతకాల బోణీ కొట్టింది. పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ దేశానికి తొలి పతకాన్ని అందించి సత్తా చాటాడు. నిన్న‌ జరిగిన పురుషుల హెవీవెయిట్ కేటగిరీ పోటీల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 72.4 కిలోల బరువున్న జండు కుమార్, తన రెండో ప్రయత్నంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మూడో ప్రయత్నంలో 196 కిలోలు ఎత్తడంలో స్వల్ప తేడాతో విఫలమయ్యాడు. పోటీల్లో చాలాసేపు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరికి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

 

బిహార్‌లోని నలందా జిల్లా హర్నాత్ గ్రామానికి చెందిన జండు కుమార్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఓ సాధారణ కూరగాయల వ్యాపారి కుమారుడైన జండు, పుట్టుకతోనే పోలియో బారినపడ్డాడు. అయినప్పటికీ ఎన్నో శారీరక, ఆర్థిక సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలిచాడు. ఆసక్తికరంగా జండు క్రీడా జీవితం పవర్‌లిఫ్టింగ్‌తో మొదలుకాలేదు. 2017లో షాట్‌పుట్, డిస్కస్ త్రో అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయి పతకాలు కూడా సాధించాడు. జిమ్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుని, ఆ తర్వాత ఈ క్రీడలోకి మారాడు.

 

అయితే, అత‌ని ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఉన్నతస్థాయి పోటీలకు అవసరమైన పోషకాహారం కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో, జీవనోపాధి కోసం కూరగాయల వ్యాపారం నడిపారు. కనీసం వీల్‌చైర్ కూడా లేని స్థితిలో, రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణించి స్థానిక మార్కెట్లకు వెళ్లేవాడు. స్నేహితుల వద్ద అప్పు చేసి కొన్న ఈ-రిక్షా వ్యాపారం కూడా కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతింది.

 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పారాలింపిక్ కాంస్య పతక విజేత రాజిందర్ సింగ్ రహేలు.. జండులోని ప్రతిభను గుర్తించాడు. గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) సెంటర్‌లో శిక్షణకు ఆహ్వానించాడు. రాజిందర్ మార్గదర్శకత్వంలో జండు కుమార్ అద్భుతంగా రాటుదేలాడు. 2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 205 కిలోలు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించాడు. కొద్ది నెలలకే ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో 206 కిలోలు ఎత్తి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఈ కామన్వెల్త్ పతకానికి ముందు బీజింగ్ ప్రపంచకప్ (2025), ఆసియా ఛాంపియన్‌షిప్‌ (2026)లలోనూ కాంస్య పతకాలు గెలుచుకుని తన సత్తా చాటుకున్నాడు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు