ఏపీకి క్యూ కట్టిన తైవాన్ దిగ్గజాలు: చంద్రబాబు, లోకేశ్‌తో హైలెవెల్ భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా అమరావతిలో ఒక కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు చెందిన పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తీవ్ర ఆసక్తిని కనబరిచాయి. ఈ మేరకు తైవాన్ పారిశ్రామిక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లతో వేర్వేరుగా సమావేశమైంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ, సెమీ కండక్టర్లు మరియు అధునాతన తయారీ రంగాలలో ఏపీతో భాగస్వామ్యంపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించారు.

డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్‌క్యూ, సీబీటీసీ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అనుకూల పారిశ్రామిక వాతావరణాన్ని వివరించారు. ఏపీలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను ప్రస్తావిస్తూ.. పెట్టుబడులు పెట్టే సంస్థలకు వేగవంతమైన అనుమతులు, పూర్తిస్థాయి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటికే దేశంలో తయారీ రంగంలో ఉన్న తాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తైవాన్ ప్రతినిధులు వెల్లడించారు.

మరోవైపు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో జరిగిన ప్రత్యేక భేటీలో ప్రధానంగా మానవ వనరుల అభివృద్ధి, ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాల కల్పనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. తైవాన్ సాంకేతిక రంగాల్లోని ఉద్యోగాలను ఏపీ యువత దక్కించుకునేలా హై-స్కిల్డ్ ట్రైనింగ్, మాండరిన్ భాషలో శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు మరియు జాయింట్ రీసెర్చ్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక పెట్టుబడులతో పాటు నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు