టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసనసభలో చంద్రబాబును నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు ప్రతిపక్ష నేతలు తనను వివాదాల్లోకి లాగి వ్యక్తిగతంగా అవమానించారని ఆమె మండిపడ్డారు. రాజకీయ పోరులో నిజమైన ధైర్యం ఉంటే ప్రత్యర్థులు నేరుగా తలపడాలి కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని స్పష్టం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ద్రౌపది మాత ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ ఉదంతాన్ని మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణంతో భువనేశ్వరి పోల్చారు. ఇతిహాసంలో కౌరవులు ద్రౌపదికి అవమానం తలపెట్టి పాండవులను దెబ్బతీయాలని చూసినట్లే, సరిగ్గా అదే తరహాలో నాటి అసెంబ్లీ వేదికగా తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబును మానసికంగా కుంగదీయాలని కుట్ర పన్నారని పరోక్షంగా వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే నైతిక హక్కు ఏ పురుషుడికి లేదని తేల్చిచెప్పిన ఆమె.. అసెంబ్లీలో తనపై జరిగిన ఆ సంఘటనను జీవితాంతం మర్చిపోలేనని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
నాటి కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే దేవుళ్లుగా నిలిచి అండగా నిలబడ్డారని భువనేశ్వరి ఉద్వేగంతో కంటతడి పెట్టారు. మహాభారతంలో ద్రౌపదిని కాపాడేందుకు శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, రాష్ట్ర ప్రజల నుంచి లభించిన అపారమైన మద్దతు, దీవెనల వల్లే తాము ఆ కఠిన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోగలిగామని తెలిపారు. తాను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నది కేవలం రాజకీయ లబ్ది కోసం కాదని, ఆనాడు తన మనసుకు జరిగిన తీవ్రమైన గాయాన్ని, ఆ చేదు అనుభవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నానని ఆమె వివరించారు.









