ఆదివాసీ అభ్యున్నతితో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…
అశ్వారావుపేటలో కొమరం భీమ్ విగ్రహావిష్కరణ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి…
ఆగస్టు 9 : TODAY9 NEWS..
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో రింగ్‌రోడ్ సెంటర్లో కొమరం భీమ్ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సమాజం విద్య, ఉపాధి, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగాలని, కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
అనంతరం గిరిజన విద్యార్థుల కేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్‌వాల్‌కు శంకుస్థాపన చేశారు. దమ్మపేట మండలం మారప్పగూడెంలో మహిళా సంఘాల కమ్యూనిటీ భవనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా, నాచారం గ్రామంలో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. నాగుపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. మంత్రి సీతక్క సహకారంతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.









