ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఉమర్ ఖాలిద్ రచించిన ‘Fractured Communities’ పుస్తకంపై సోమవారం నిర్వహించిన చర్చా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమంలో JNU విద్యార్థి సంఘం (JNUSU) నేతలు ఉమర్ ఖాలిద్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. SSS-2 భవనం వెలుపల ‘ఉమర్ ఖాలిద్‌ను విడుదల చేయాలి’, ‘జైలు తాళాలు బద్దలవుతాయి.. సహచరులంతా విడుదలవుతారు’ అంటూ నినాదాలు వినిపించాయి. దీనిని వ్యతిరేకిస్తూ ABVP మద్దతుదారులు కూడా నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పుస్తకంపై చర్చ కోసం ఆడిటోరియంను ముందుగానే బుక్ చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో JNU పరిపాలన అనుమతిని రద్దు చేసినట్లు JNUSU తెలిపింది. అయినప్పటికీ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా SSS-2 భవనం వెలుపల చర్చను నిర్వహించినట్లు పేర్కొంది. వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారని JNUSU వెల్లడించింది. కార్యక్రమాన్ని ABVP మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, స్పీకర్ నుంచి మైక్రోఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పాటు ప్యానెలిస్టులతో దురుసుగా ప్రవర్తించారని విద్యార్థి సంఘం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై ABVP, JNU పరిపాలన నుంచి స్పందన వెలువడలేదు.
ఘటన అనంతరం JNUSU ప్రకటన విడుదల చేస్తూ యూనివర్సిటీలో చర్చలు, వాదనలు, భిన్నాభిప్రాయాలకు ఉన్న స్థలాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఉమర్ ఖాలిద్‌తో పాటు తాము ‘రాజకీయ ఖైదీలు’గా భావించే వారికి మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. ABVP విద్యా చర్చలను అడ్డుకుంటూ ద్వేషం, హింసను ప్రోత్సహిస్తోందని JNUSU ఆరోపించింది. ఈ పరిణామాలతో JNUలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది.









