డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ PhonePe తన పెట్టుబడి సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పెట్టుబడి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన PhonePe.. తాజాగా చిన్న మొత్తాలతో రోజువారీగా పొదుపు చేసుకునేలా Daily Recurring Deposit (RD) ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవను Shivalik Small Finance Bank భాగస్వామ్యంతో అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Daily RD ద్వారా యూజర్లు ప్రతిరోజూ రూ.100 నుంచి రూ.1,000 వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా.. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేసే విధంగా ఈ సదుపాయాన్ని రూపొందించారు. దీంతో రోజువారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని క్రమంగా సేవ్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఆప్షన్ ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ పెట్టుబడులను UPI AutoPay ద్వారా ఆటోమేటిక్గా కొనసాగించుకునే సదుపాయం కూడా PhonePe కల్పిస్తోంది. దీంతో నిర్ణయించిన మొత్తాన్ని ప్రతిరోజూ ఆటోమేటిక్గా RDలోకి బదిలీ చేయవచ్చు. అయితే పెట్టుబడి చేసే ముందు వడ్డీ రేటు, కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, ఇతర షరతులను యూజర్లు తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.









