రేణిగుంట పట్టణంలో మద్యం షాపులను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సోమవారం వీధి నిరసన నిర్వహించారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని పాంచాలినగర్లో చేపట్టిన ఈ నిరసన మూడో రోజుకు చేరుకుంది. మద్యం షాపుల కారణంగా మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి మాట్లాడుతూ.. రేణిగుంటలో జరిగే శ్రీ గంగమ్మ జాతరను మద్యం సేవించే వారి జాతరగా మారకముందే చర్యలు తీసుకోవాలని కోరారు. జాతర సందర్భంగా మద్యం షాపుల విక్రయాలను నిలిపివేసి, వాటిని పూర్తిగా మూసివేయడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మద్యం విక్రయాల వల్ల స్థానికంగా శాంతిభద్రతలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులతో పాటు స్థానిక మహిళలు, చిన్నారులకు మద్యం సేవించిన వారి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మద్యం షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.









