మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీపీఎం, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
ధర్నా సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు సీపీఎం, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కొంతసేపు తహశీల్దార్ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.









