వనపర్తి జిల్లా పెబ్బేరు చెరువులో భారీ మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువు కట్ట సమీపంలోని చిన్న గడ్డిమైదానంలో మొసలి సంచరిస్తుండగా, అటుగా వెళ్తున్న ఓ బాటసారి తన కెమెరాలో దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ వీడియో ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చెరువు పరిసరాల్లో నిత్యం ప్రజలు, పశువులు సంచరిస్తుంటారని స్థానికులు తెలిపారు. మొసలి చెరువులోకి వెళ్లడం, కొంతసేపటి తర్వాత మళ్లీ చెరువు కట్టపైకి రావడం గమనించినట్లు చెప్పారు. దీంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొసలి సంచారంపై అధికారులు, అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు, పశువులు చెరువు పరిసరాల్లోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.









