మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయం కావడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భుజం గాయం త్వరగా, సంపూర్ణంగా నయం కావడానికి శస్త్రచికిత్స అవసరమని నిపుణులైన వైద్యుల బృందం నిర్ణయించినట్లు పేర్కొంది.
డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దీంతో తారక్ అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు ప్రత్యేక రీహాబిలిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైద్యుల అంచనా ప్రకారం ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి రావడానికి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కిమ్స్ ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు సంతకంతో ఈ హెల్త్ బులెటిన్ విడుదలైంది.









