అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బయట ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏమిటని వైసీపీని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు శాసనసభలో తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే బాధ్యత ఉందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై అనిత స్పందించారు. గతంలో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించిన జగన్.. ఇప్పుడు అదే మండలికి తమ పార్టీ ప్రతినిధులను పంపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడం సరైన విధానం కాదని అన్నారు.
ఎమ్మెల్యేగా గెలవడం ఎంత ముఖ్యమైన బాధ్యతో.. నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా అంతే ముఖ్యమని అనిత తెలిపారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి తమ వద్ద ఉన్న ఆధారాలను సభ ముందుంచాలని, ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అసెంబ్లీ కంటే గొప్ప ప్రజాస్వామ్య వేదిక మరొకటి లేదని హోంమంత్రి పేర్కొన్నారు.









