ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను మరింత ఓటర్ ఫ్రెండ్లీగా మార్చాలని వైఎస్సార్‌సీపీ భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు లేఖ రాశారు. అన్‌మ్యాప్‌డ్, మిస్‌మ్యాచ్‌డ్ ఓటర్ల ధృవీకరణలో పలు కీలక మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓటరు స్వయంగా హాజరు కాలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకుల ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించే అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగం, చదువు లేదా వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు కూడా వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఓటరు తరఫున పత్రాలు సమర్పించే బంధువులకు సంబంధ ధ్రువీకరణ పత్రం, అధికారిక అనుమతితో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
వెరిఫికేషన్ నోటీసుల్లో ధృవీకరణ జరిగే ప్రదేశం, తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని వైఎస్సార్‌సీపీ కోరింది. బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO) ద్వారా స్థానికంగానే ఓటర్ల ధృవీకరణకు అవకాశం కల్పించాలని సూచించింది. పత్రాల స్వీకరణతో పాటు ప్రాథమిక, ఫీల్డ్ వెరిఫికేషన్‌లోనూ BLOలను భాగస్వామ్యం చేయాలని కోరింది. ప్రతి ఓటరు ఉన్నతస్థాయి ఎన్నికల అధికారిని వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేకుండా స్థానిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.









