రాష్ట్రంలో అమలవుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న పరిస్థితికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను సైతం ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన కొనసాగుతోందని జగన్ ఆరోపించారు. అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో వందలాది మంది పోలీసులు దొంగల్లా, బందిపోటు ముఠాల మాదిరిగా వచ్చి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి తలుపులు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆయనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. పగటిపూట నోటీసులు ఇస్తే హాజరుకాని వ్యక్తి ఆయన కాదని ప్రశ్నించారు.
గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే విరూపాక్షిపై మూడు కేసులు నమోదు చేశారని జగన్ మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన కుమారుడు, తమ్ముడు, తమ్ముడి కుమారుడిని కూడా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, అణచివేత చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జగన్ విమర్శించారు.









