ముంబైలో అమితాబ్ బచ్చన్ భారీ రియల్ ఎస్టేట్ డీల్: నెలకు రూ.33 లక్షల అద్దెతో ఆఫీస్ స్పేస్ లీజు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినీ రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ తనదైన జోరు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ముంబై అంధేరి వెస్ట్‌లోని ఓషివారా లింక్ రోడ్‌లో ఉన్న ప్రముఖ ‘సిగ్నేచర్’ భవనంలోని మూడు పై అంతస్తులను న్యూట్రిషన్ ఉత్పత్తుల సంస్థ ‘ట్రూనేటివ్ ఎఫ్&బి ప్రైవేట్ లిమిటెడ్’కు ఆయన లీజుకు ఇచ్చారు. మొత్తం 8,428 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కమర్షియల్ స్పేస్ ద్వారా నెలకు రూ.33 లక్షల అద్దె లభించనుంది.

ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ లీజు ఒప్పందం ఐదేళ్ల కాలపరిమితితో కుదిరింది. ఈ ఐదేళ్ల వ్యవధిలో అద్దె రూపంలోనే బిగ్ బీకి మొత్తం రూ.21.88 కోట్ల భారీ ఆదాయం సమకూరనుంది. ఒప్పంద నిబంధనల ప్రకారం ట్రూనేటివ్ సంస్థ రూ.1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడంతో పాటు, ఏటా అద్దె 5 శాతం పెరిగేలా మరియు 9 వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించేలా అంగీకారం కుదిరింది. గతంలోనూ ఇదే భవనంలోని నాలుగు యూనిట్లను నెలకు రూ.17.30 లక్షల అద్దెతో వార్నర్ మ్యూజిక్ సంస్థకు అమితాబ్ లీజుకు ఇవ్వడం గమనార్హం.

ముంబైలోని ప్రతిష్ఠాత్మక ‘జల్సా’, ‘జనక్’, ‘వత్స’ వంటి విలాసవంతమైన బంగ్లాలతో పాటు అమితాబ్ దేశవ్యాప్తంగా తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నారు. ముంబై వెలుపల అలీబాగ్‌లో రూ.10 కోట్లతో భూమిని కొనుగోలు చేయడమే కాకుండా, ఇటీవల అయోధ్యలోనూ సుమారు రూ.35 కోట్ల భారీ పెట్టుబడితో భూమిని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు