ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసు: ఆప్ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు (DJB) మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STP) ఆధునీకరణ టెండర్ల కేటాయింపులో జరిగిన భారీ అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కీలక చర్య తీసుకున్నారు. సత్యేందర్ జైన్‌తో పాటు ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈఓ, ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, మాజీ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవ మరియు పలువురు ప్రైవేట్ వ్యక్తులు సహా మొత్తం ఆరుగురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

టెండర్ ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి, ఒక నిర్దిష్ట ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. గతంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సుమారు 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన సత్యేందర్ జైన్, ఇప్పుడు మరో కొత్త కేసులో అరెస్ట్ కావడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

ఈ అరెస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆప్ ఆరోపించింది. టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న సమయంలో సత్యేందర్ జైన్ జైలులోనే ఉన్నారని, ఈ తప్పుడు కేసు న్యాయస్థానంలో వీగిపోతుందని ఆప్ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు