వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో ‘వందేమాతరం’ నినాదం వింటే బ్రిటిష్ పాలకులకు ఎలాంటి భయం కలిగేదో, నేడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే విధమైన భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ అంశంలో నాటి విదేశీ పాలకులకు, నేటి కాంగ్రెస్ నాయకులకు మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో మాట్లాడిన బండి సంజయ్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల తీరును చూసి దేశ ప్రజలు విస్మయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం గీతాలాపనను నిరోధించడం అత్యంత దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్ దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని, స్ఫూర్తిని రగిల్చిన ఈ గేయం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
దేశంలో కేవలం కాంగ్రెస్, మజ్లిస్ (ఎంఐఎం) పార్టీలు మాత్రమే వందేమాతరాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశ గౌరవాన్ని, జాతీయ ప్రతీకలను కించపరిచేలా వ్యవహరిస్తున్న ఇరు పార్టీలకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.









