చెన్నైలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం: ఒకే వేదికపైకి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా జరగనున్న 31వ ‘సదరన్ జోనల్ కౌన్సిల్’ (దక్షిణ ప్రాంతీయ మండలి) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒకే వేదికను పంచుకోనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆగస్టు 20న జరిగే ఈ అత్యున్నత స్థాయి భేటీకి ఏపీ, తమిళనాడులతో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరియు కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై ముఖాముఖి కనిపించనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. గురువారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకుని ఉండవల్లి నివాసానికి వెళ్లనున్నారు.

రాష్ట్రాల మధ్య పరస్పర సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరిగే ఈ కౌన్సిల్ భేటీలో ప్రధానంగా విభజన చట్టం పెండింగ్ అంశాలు, ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు, సరిహద్దు అంశాలు, నీటి పంపిణీ వివాదాలు మరియు అంతర్రాష్ట్ర రవాణా వంటి విషయాలపై విస్తృతంగా చర్చించి సిఫార్సులు చేయనున్నారు. గతంలో తిరువనంతపురంలో జరిగిన 30వ సదస్సులో పలు కీలక సమస్యలపై చర్చలు జరగ్గా, తాజా సమావేశంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు