పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన: యూకే, అమెరికాలో 10 రోజుల పాటు కీలక భేటీలు

తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ముగిసిన అనంతరం నేరుగా బయలుదేరనున్న ఆయన, ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికాలో పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. లండన్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి హాజరైన అనంతరం సీఎం తన అధికారిక పర్యటనను ప్రారంభిస్తారు.

ఈ పర్యటనలో భాగంగా యూకేలోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో పాటు లండన్ బిజినెస్ స్కూల్ వర్గాలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అనంతరం అమెరికా చేరుకుని బోస్టన్‌లోని హార్వర్డ్, ఎంఐటీ (MIT), నార్త్‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి, ఆఫ్-షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుపై చర్చిస్తారు. అలాగే న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో సీఎం భేటీ కానున్నారు. .

ఈ విదేశీ టూర్‌లో ప్రధాన ఆకర్షణగా గ్లోబల్ సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులు, బహుళజాతి సంస్థల అధిపతులతో ప్రత్యేక రౌండ్‌టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు మరియు అత్యాధునిక తయారీ రంగాల్లో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులను రప్పించి, తద్వారా యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు