పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తూర్పు ఆసియాలోనూ అమెరికా విధానంపై చర్చ మొదలైంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యల్లో దక్షిణ కొరియా నేరుగా భాగస్వామి కావడానికి నిరాకరించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సంబంధాల విషయంలో అమెరికా వైఖరిపై ఆసక్తి పెరిగింది.
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా చేసిన పోస్టు ద్వారా అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల పరిమాణాన్ని తగ్గించే అంశంపై సంకేతాలు ఇచ్చినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా చాలాకాలంగా తమపై దాడికి సన్నాహకంగా అభివర్ణిస్తోంది. దీంతో ఈ విన్యాసాలపై అమెరికా నిర్ణయం తీసుకోవడం ప్యాంగ్యాంగ్‌తో దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు ఆసక్తి చూపుతున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే దక్షిణ కొరియా-అమెరికా సైనిక కూటమి విషయంలో ఎలాంటి దీర్ఘకాలిక మార్పులు చోటుచేసుకుంటాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు కేవలం ఇరాన్ సంక్షోభానికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయమా.. లేక ఉత్తర కొరియాతో కొత్త దౌత్య ప్రయత్నాలకు సంకేతమా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









