దేశంలో డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలను అరికట్టే చర్యల్లో భాగంగా టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే ఉండే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని టెలికాం సేవా ప్రదాతలకు (TSPs) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 9 సిమ్ కార్డులు ఉన్న చందాదారులకు అదనంగా ఎలాంటి కొత్త మొబైల్ కనెక్షన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
ఈ నిబంధన ప్రధానంగా మొబైల్ కనెక్షన్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, సైబర్ నేరాలకు ఉపయోగించే సిమ్ కార్డుల చలామణిని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకే వ్యక్తి గుర్తింపు వివరాలతో పెద్ద సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు తీసుకుని వాటిని మోసాలు, స్పామ్ కాల్స్, ఇతర అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశాలను తగ్గించేందుకు DoT ఈ చర్యను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 24 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. దీంతో టెలికాం సంస్థలు కొత్త కనెక్షన్ జారీ చేసే ముందు సంబంధిత చందాదారుడి పేరుపై ఇప్పటికే ఉన్న మొబైల్ కనెక్షన్ల సంఖ్యను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. 9 కనెక్షన్ల పరిమితి దాటిన వారికి కొత్త సిమ్ జారీ కాకపోవడంతో పాటు, మొబైల్ నంబర్ల దుర్వినియోగాన్ని తగ్గించడంలో ఈ చర్య కీలకంగా మారే అవకాశం ఉంది.









