వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. దేశ జనాభాలో దాదాపు 50 శాతం మంది యువత ఉన్నారని, వారి శక్తి, ప్రతిభను సరైన దిశలో వినియోగిస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలా? వస్తే ఎప్పుడు రావాలి? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని అన్నారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు అనుభవం, స్థిరత్వం ఎంతో అవసరమని ప్రమోద్ సావంత్ అభిప్రాయపడ్డారు. 40 ఏళ్ల వయసు తర్వాత రాజకీయాల్లోకి రావడం మంచిదని, అంతకుముందు జీవితంలో అనుభవాన్ని సంపాదించుకోవడంతో పాటు ఆర్థికంగా, వ్యక్తిగతంగా స్థిరపడాలని యువతకు సూచించారు. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తే సమాజానికి మరింత సమర్థవంతంగా సేవ చేయగలరని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ నిర్మాణానికి యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి, గరీబ్ కళ్యాణ్ నాలుగు ప్రధాన మూలస్తంభాలని సావంత్ అన్నారు. గతంలో దేశంలోని ఎంతోమందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవని, జనధన్ ఖాతాల ద్వారా వారిని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5G కనెక్టివిటీతో పాటు దేశంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో యువత కేవలం రాజకీయాల్లోకి రావడమే కాకుండా దేశ అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలోనూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.









