చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ అధికారి ఎం.టెక్ పూర్తి చేసి తన తరగతిలో టాప్-10లో నిలిచారు. గత నెలలో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లను పర్యవేక్షించే నియంత్రణ సంస్థలో డిప్యూటీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించి ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది.
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ప్రతి వారం దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చినా, ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా నోట్స్ రాసుకోవడంతో పాటు పరీక్షలకు సిద్ధమయ్యేవారు. యువ విద్యార్థులతో పోటీపడి మరీ మెరుగైన ఫలితాలు సాధించి తన తరగతిలో టాప్-10లో చోటు సంపాదించారు. ఆయన పట్టుదల, క్రమశిక్షణ ఇప్పుడు పలువురికి స్ఫూర్తిగా మారింది.
ఎం.టెక్‌తో తన విద్యాభ్యాసాన్ని ఆపేయకుండా మరింత ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. తదుపరి ఐఐఎం లక్నోలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన కుమారుడు శశాంక్ శ్రీవాస్తవ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విజయగాథ నెట్టింట వైరల్‌గా మారింది. వయసు ఎంతైనా నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే కొత్త లక్ష్యాలను చేరుకోవచ్చని ఆయన ప్రయాణం మరోసారి నిరూపిస్తోంది.









