తల్లితనం ఒక స్త్రీ జీవితంలో అందమైన అనుభవం కావచ్చు. కానీ ఒక మహిళ విలువను తల్లిగా మారిందా లేదా అనే ఒక్క విషయంతో నిర్ణయించడం సరికాదు. పెళ్లయి సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోతే ఆమెపై ప్రశ్నల వర్షం మొదలవుతుంది. “ఇంకా పిల్లలు లేరా?”, “ఏమైనా సమస్య ఉందా?”, “డాక్టర్‌ను కలిశారా?”, “ఎప్పుడు శుభవార్త చెబుతారు?” అంటూ అడిగే ప్రశ్నలు వారికి సాధారణంగానే అనిపించవచ్చు. కానీ ఆ మాటల ప్రభావం మాత్రం ఎంతో లోతుగా ఉంటుంది.
బయటివారు అడిగిన ప్రతి ప్రశ్నను ఆమె తన మనసులో మోసుకుంటూ ఇంటికి తిరిగి వస్తుంది. ఒక్కో మాట గుండెల్లో ఒక చిన్న గాయంలా మిగులుతుంది. పిల్లలు పుట్టకపోవడం పూర్తిగా వ్యక్తిగతమైన విషయం అయినప్పటికీ, సమాజం దాన్ని కుటుంబం, బంధువులు, పరిచయస్తుల చర్చగా మార్చేస్తుంది. ముఖ్యంగా మహిళనే బాధ్యతగా భావించి ప్రశ్నించడం ఆమెపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
చివరికి ఇతరులు వేసిన ప్రశ్నలే ఆమె తనను తాను ప్రశ్నించుకునే పరిస్థితికి తీసుకెళ్తాయి. “నా శరీరంలో ఏదైనా లోపం ఉందా?”, “నేను తల్లిని కాలేనేమోనా?” అనే ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. ఒక మహిళ జీవితానికి తల్లితనం ఒక భాగం మాత్రమే.. ఆమె వ్యక్తిత్వం, విలువ, కలలు, సామర్థ్యాలు అంతకంటే ఎంతో పెద్దవి. అందుకే అనవసరమైన ప్రశ్నలతో బాధపెట్టడం కంటే, ఆమె వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించి అర్థం చేసుకోవడం సమాజం నేర్చుకోవాలి.









