గ్రామంలో ప్రజల నుంచి చెత్త సేకరించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో వినియోగిస్తున్న చెత్త రిక్షాలు పాత సామాన్ల కొనుగోలు దుకాణంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన పంచాయతీ వాహనాలు పాత సామాన్ల దుకాణానికి చేరడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీకి చెందిన సామగ్రి బయటకు ఎలా వెళ్లింది? ఎవరి అనుమతితో చెత్త రిక్షాలు పాత సామాన్ల దుకాణానికి చేరాయి? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
పంచాయతీకి చెందిన వాహనాలు, ఇతర సామగ్రిని ప్రజల అవసరాల కోసం సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.









