మధ్యప్రదేశ్‌లో వరద బీభత్సం.. ప్రాణాలకు తెగించి నది దాటుతున్న ఉపాధ్యాయులు

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోగా.. భింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నద్రౌలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రాజేష్ భారతి ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల, నివాస ప్రాంతాల మధ్య ఉన్న నది సాధారణ రోజుల్లో ఎండిపోయి ఉంటుంది. అయితే వర్షాకాలంలో భారీ వర్షాలతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లేందుకు వంతెన లేదా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరద ప్రవాహాన్ని దాటేందుకు ఉపాధ్యాయులు టైర్ల సాయంతో నదిని ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధులకు గైర్హాజరైతే జీతాల్లో కోత పడుతుందనే భయంతోనే ఉపాధ్యాయులు ఈ ప్రమాదకర ప్రయాణం చేస్తున్నట్లు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share