దిశా సాలియన్ కేసులో కీలక మలుపు.. పోలీసుల దర్యాప్తుపై బాంబే హైకోర్టు ప్రశ్నలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2020లో ముంబైలోని ఓ హై రైజ్ భవనం నుంచి కిందపడటంతో దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ మాత్రం తన కుమార్తె మరణంపై అనుమానాలు ఉన్నాయని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

2026 ఆగస్టు 28న జరిగిన విచారణలో దిశా మృతదేహానికి సంబంధించిన వైద్య, పోలీసు రికార్డులపై బాంబే హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. 14వ అంతస్తు నుంచి కిందపడిన వ్యక్తి తల భాగంలో ఎలాంటి ఫ్రాక్చర్లు లేకపోవడం, మృతదేహం పడివున్న ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించకపోవడంపై కోర్టు ముంబై పోలీసులను ప్రశ్నించింది. ఈ అంశాలపై దర్యాప్తు ఎలా జరిగిందన్న దానిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక పోలీసుల ఇన్క్వెస్ట్ పంచనామా నివేదికలో దిశా మృతదేహంపై దుస్తులు లేవని పేర్కొనగా, ఆసుపత్రి, శవాగారంలో తీసిన ఫోటోల్లో మాత్రం దుస్తులు ఉన్నట్లు కనిపించడంపై కోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఒకే ఘటనకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో ఇలాంటి వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో వివరించాలని పోలీసులను కోరింది. దర్యాప్తు తీరుపై ప్రశ్నలు లేవనెత్తిన బాంబే హైకోర్టు తన తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో ఈ కేసుపై మరోసారి ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు