ఇంట్లో 24 గంటలూ నిరంతరం పనిచేసే ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో రిఫ్రిజిరేటర్ ఒకటి. అయితే వంటగదిలో స్థలాన్ని ఆదా చేయడం కోసం చాలామంది ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెడుతుంటారు. చూడటానికి బాగుంటుందని భావించినా.. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్రిజ్ వెనుక భాగంలో గాలి ప్రసరణకు తగినంత స్థలం లేకపోవడం సమస్యగా మారుతుంది.
ఫ్రిజ్ పనిచేసే సమయంలో కంప్రెసర్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడి బయటకు సరిగ్గా వెళ్లేందుకు వెనుక భాగంలో తగినంత ఖాళీ అవసరం. గోడకు పూర్తిగా ఆనించి పెడితే వేడి బయటకు వెళ్లడం కష్టమై కంప్రెసర్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది. దీంతో ఫ్రిజ్‌ను చల్లగా ఉంచేందుకు ఎక్కువ సమయం పనిచేయాల్సి రావడంతో విద్యుత్ వినియోగం కూడా పెరగొచ్చు.
అంతేకాకుండా నిరంతరం అధిక ఒత్తిడితో పనిచేయడం వల్ల కంప్రెసర్‌తో పాటు ఫ్రిజ్‌లోని ఇతర అంతర్గత భాగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా ఫ్రిజ్ పనితీరు తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం లేదా ఉపకరణం జీవితకాలం తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసేటప్పుడు తయారీదారు సూచించినంత వెనుక, పక్కల ఖాళీ ఉండేలా చూసుకోవడం మంచిది.









