సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాను 2026 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే సమయంలో టాలీవుడ్లో భారీ సినిమాలు బరిలోకి దిగుతుండటంతో ‘జైలర్ 2’ విడుదల తేదీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2023లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఏకే 47’ కూడా అక్టోబర్ 16న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను అక్టోబర్ 9న తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ, ఆ తేదీ సాధ్యం కాకపోతే అక్టోబర్ 16ను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదలైతే, మరుసటి రోజే రెండు భారీ తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టార్‌డమ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ‘జైలర్’ తెలుగు వెర్షన్‌కు వచ్చిన స్పందన, రజనీకి ఉన్న ప్రత్యేకమైన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ‘జైలర్ 2’కు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పోటీ నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ డేట్‌ను మారుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.









