మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం.. నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా కరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను సీఎం ప్రారంభించి, జలాలను విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీటి వసతి మెరుగుపడి కొత్త ఆశలు చిగురించనున్నాయి.

వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందనుండటంతో వ్యవసాయ రంగానికి ఊతం లభించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు తొలి దశ ప్రారంభం కీలక ఘట్టంగా మారనుంది.

మరోవైపు 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను ఆయన స్వయంగా ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేపట్టగా, ప్రాజెక్టు ప్రారంభంతో తమ ప్రాంత రూపురేఖలు మారుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు