తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసే విధానం అమల్లో ఉంది. ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికి ‘క్రాస్ వాల్యుయేషన్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
క్రాస్ వాల్యుయేషన్‌లో భాగంగా ఒక పాఠశాల విద్యార్థుల జవాబు పత్రాలను అదే పాఠశాల ఉపాధ్యాయులు కాకుండా ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నారు. దీనివల్ల మూల్యాంకనంలో వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాతానికి అవకాశం తగ్గడంతో పాటు విద్యార్థులకు న్యాయమైన మార్కులు లభించే అవకాశం ఉంటుందని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే పాఠశాలల విద్యా ప్రమాణాలను కూడా మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థుల అసలు ప్రతిభను గుర్తించడం, పరీక్షల మూల్యాంకనంలో పారదర్శకత పెంచడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను మరింత సమర్థవంతంగా విశ్లేషించేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి అవసరమైన విద్యా చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖకు ఈ విధానం ఉపయోగపడనుంది.









