హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. అహ్మదాబాద్ రికార్డుపై తెలంగాణ గురి

తెలంగాణ క్రీడా రంగంలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్న 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. ఈ రికార్డును అధిగమించేలా హైదరాబాద్‌లో కొత్త స్టేడియాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

భారీ సీటింగ్ సామర్థ్యంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు, ప్రేక్షకులకు మెరుగైన అనుభూతిని అందించే మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల నిర్వహణకు అనువైన సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ అంతర్జాతీయ క్రికెట్ వేదికగా మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.

స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుండగా.. నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన వ్యయాలను బీసీసీఐ భరించనుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో క్రీడా మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు