“లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్‌గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో..!” ఎవరైనా తమ బాధను మనతో పంచుకున్నప్పుడు చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాటలు ఇవే. అయితే అవతలి వ్యక్తి చెప్పిన మాటల వెనుక ఉన్న బాధను, అతడి మనసులో జరుగుతున్న సంఘర్షణను మాత్రం మనం చాలా సార్లు పట్టించుకోం. సమస్య చిన్నదిగా కనిపించినా.. దాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తికి అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఒక వ్యక్తి రాత్రంతా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి. ఉదయం జరిగిన ఓ ఘటన పదేపదే గుర్తొస్తూ, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. చివరకు మనసులోని బాధను ఎవరికైనా చెప్పుకోవాలని ఫోన్ చేస్తారు. అవతలి వ్యక్తి మాత్రం వెంటనే “లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు” అని చెప్పి ఉండొచ్చు. కానీ ఫోన్ పెట్టిన తర్వాత కూడా ఆ వ్యక్తి అదే విషయాన్ని మరోసారి ఆలోచిస్తూ.. “నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు” అనే భావనకు లోనయ్యే అవకాశం ఉంది.
అందుకే ఎవరైనా తమ బాధను మనతో పంచుకున్నప్పుడు వెంటనే సలహా ఇవ్వడం కంటే.. ముందుగా వారిని శ్రద్ధగా వినడం అవసరం. “నీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థమవుతోంది”, “నువ్వు మాట్లాడాలనుకుంటే నేను వింటాను” అనే చిన్న మాటలు కూడా ఎంతో ఊరటనిస్తాయి. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పాల్సిన అవసరం లేదు.. కొన్నిసార్లు మనసులోని మాటను తీర్పు లేకుండా వినే ఒక మనిషి ఉంటే చాలు. ఎదుటివారి బాధను తక్కువ చేసి చూడకుండా, వారి భావాలను గౌరవించడం కూడా ఒక రకమైన మానవత్వమే.









