సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరును ఉపయోగించి మధ్యప్రదేశ్‌లో ఓ కేటుగాళ్ల ముఠా భారీ సైబర్ మోసానికి పాల్పడినట్లు సమాచారం. విజయ్‌కు సొంతంగా ఓ పెద్ద ఛారిటబుల్ ట్రస్ట్ ఉందని, అందులో తామే ముఖ్య అధికారులమని నమ్మబలికారు. ఆ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం, స్వయం ఉపాధి రుణాలు అందిస్తామని చెప్పి పలువురిని మోసం చేశారు.
సోషల్ మీడియా వేదికగా మధ్యప్రదేశ్ ప్రజలను నేరుగా సంప్రదించిన నిందితులు.. ముఖ్యంగా నిరుద్యోగులు, చిన్న వ్యాపారులను టార్గెట్ చేశారు. ప్రభుత్వేతర పథకాల ద్వారా రూ.లక్షల్లో ఉపాధి రుణాలు, ఉచిత ఆర్థిక సహాయం అందిస్తామని ఆశ చూపారు. రుణాలు లేదా ఆర్థిక సాయం పొందేందుకు ముందుగా కొన్ని రకాల రుసుములు చెల్లించాలని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
సీఎం విజయ్ పేరు, ఛారిటబుల్ ట్రస్ట్ పేరును ఉపయోగించడంతో బాధితులు నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన పథకంగా భావించినట్లు సమాచారం. ఇలా నమ్మకం కలిగించి లక్షలాది రూపాయలను కాజేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, ప్రముఖుల పేరుతో వచ్చే ఆర్థిక సాయం, రుణాల ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. డబ్బులు పంపించే ముందు వాటి నిజానిజాలను అధికారిక మార్గాల్లో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.









