తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన? కీలక మంత్రులకు ఉద్వాసన..?
తెలంగాణలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ను చేయబోతున్నారా ? కీలక మంత్రులకు ఉధ్వాసన పలకన్నారా అనే ప్రశ్నలకు అవుననే సంకేతాలు వస్తున్నాయి.అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తర్వాత తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు ఉంటాయన్న ప్రచారం నడుస్తోంది.
కాగా, నలుగురు మంత్రులను తప్పించే యోచనలో సీఎం శిబిరం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.చర్చలో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావుల పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కేబినెట్లోకి తీసుకుని, ఆయన స్థానంలో .. అడ్లూరి లక్ష్మణ్‌ను స్పీకర్‌గా చేయాలనే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. అదే క్రమంలో,కొండా సురేఖను తప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి సురేఖ వ్యవహారంపై ఆధారాలు ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి, మరో మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానంలో ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఆకాంక్షను బలంగా వినిపిస్తున్నారు. అయితే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం,రామ్మోహన్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి దక్కవచ్చన్న చర్చ సైతం సాగుతోంది.
మరోవైపు పొన్నం స్థానంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరును సీఎం శిబిరం ప్రతిపాదించినట్టు ప్రచారం సాగుతుండగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆర్థిక శాఖ అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖకు బదులుగా రెవెన్యూ శాఖ కోరుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శాఖ మార్పుపై కూడా కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. అయితే రెవెన్యూ శాఖను మార్చితే మున్సిపల్ శాఖ ఇవ్వాలని పొంగులేటి పట్టుబడుతున్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే మొత్తంగా రెవెన్యూ, నీటిపారుదల, పరిశ్రమలు, పురపాలక శాఖల్లో భారీ మార్పులు ఉండొచ్చన్న ఊహాగానాలు వినవస్తున్నాయి.
Post Views: 42









