దీర్ఘకాలిక హోమ్ లోన్ తీసుకునే ముందు మొత్తం వడ్డీ భారం ఎంత ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్‌ను 7.5 శాతం వార్షిక వడ్డీతో 30 సంవత్సరాల కాలానికి తీసుకున్నారని అనుకుందాం. ఈ లెక్క ప్రకారం నెలకు సుమారు రూ.34,960 EMI చెల్లించాల్సి ఉంటుంది.
30 సంవత్సరాల పాటు ఇదే EMI కొనసాగితే.. మొత్తం రూ.1.26 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుంది. ఇందులో అసలు రుణం రూ.50 లక్షలు కాగా.. మిగిలిన మొత్తం వడ్డీగా వెళ్తుంది. అంటే సుమారు రూ.75.85 లక్షల వరకు వడ్డీ భారం పడుతుంది. ఈ లెక్క చూస్తే దీర్ఘకాలిక రుణాల్లో వడ్డీ మొత్తం ఎంత భారీగా ఉంటుందో అర్థమవుతుంది.
అందుకే హోమ్ లోన్ తీసుకునే సమయంలో కేవలం నెలవారీ EMI ఎంత అనే విషయాన్నే కాకుండా.. మొత్తం రీపేమెంట్, వడ్డీ భారం, లోన్ కాలవ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వీలైనంత తక్కువ కాలవ్యవధిని ఎంచుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పార్ట్ ప్రీపేమెంట్లు చేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.









