ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా OpenAIకి చెందిన ChatGPT, Anthropicకు చెందిన Claude, xAIకి చెందిన Grok సేవలను వినియోగించడంలో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 8:30 గంటల నుంచి సేవలు సరిగా పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఐ సేవలపై ఆధారపడుతున్న యూజర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ChatGPT, Claude, Grok వంటి ప్రముఖ జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఒకేసారి అంతరాయం ఏర్పడటంతో ఈ ఘటనపై ఆసక్తి నెలకొంది. వేలాది మంది యూజర్లు సేవలు అందుబాటులో లేవని, వివిధ రకాల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఈ అంతరాయానికి అసలు కారణం ఏమిటన్నది వెంటనే స్పష్టంగా తెలియలేదు.
యూజర్ల నుంచి సమస్యలపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సంబంధిత సంస్థలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయి. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం వ్యక్తిగత వినియోగంతో పాటు వ్యాపార, విద్యా, సాఫ్ట్వేర్ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో.. ఒకేసారి పలు ప్రముఖ సేవలకు అంతరాయం ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది.









