తెలంగాణ శాసనసభ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు భద్రతా ఏర్పాట్లను ధిక్కరించి ప్రయత్నించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు 14 మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. బాలస్వామి ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు కార్డన్‌ను దాటుకుని లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయడం, కాలర్లు పట్టుకోవడం, దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహిళా పోలీసు సిబ్బందిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అవమానకరంగా ప్రవర్తించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు సుధీర్‌రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శంభీపూర్ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్, మీడియా విజువల్స్‌ను పరిశీలించిన అనంతరమే కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.









