భారత్‌-పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. మళ్లీ మైదానంలో చిరకాల ప్రత్యర్థులు!

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆసక్తికరమైన పోరుగా పేరున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను మరోసారి మైదానంలో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కు అవకాశం లేకపోయినా.. ముక్కోణపు లేదా నాలుగు దేశాల సిరీస్‌ నిర్వహించే ప్రతిపాదనను ఐసీసీ పరిశీలిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ అంశం రాబోయే ఐసీసీ ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ చర్చల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే భారత్‌, పాకిస్థాన్‌తో పాటు మరో జట్టు లేదా రెండు జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి జట్ల పేర్లు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌ ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యంగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ పునరుద్ధరణకు సంబంధించి ఉన్న రాజకీయ, పరిపాలనా అంశాలే ఈ ప్రతిపాదనకు ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉంది.

సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తే తటస్థ వేదికగా యూఏఈ, ఇంగ్లండ్‌ లేదా ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉన్న భారీ టీవీ వ్యూయర్‌షిప్‌, వాణిజ్య విలువను దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్మాట్‌పై ఐసీసీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు