తెలంగాణలో శాసనసభ వేదికగా చెలరేగిన రాజకీయ వివాదం ఇప్పుడు రాజ్భవన్కు చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం రాష్ట్ర గవర్నర్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్తతలు, శాంతిభద్రతల క్షీణత వంటి కీలక అంశాలపై గవర్నర్కు సమగ్ర నివేదికను అందించి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అధికారికంగా ఫిర్యాదు చేయనున్నారు.
ముఖ్యంగా అసెంబ్లీ గేట్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగి, మెడలు పట్టుకుని అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మహిళా సభ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పోలీసు అధికారులపై కఠిన విచారణ జరిపి చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరనున్నారు.
మరోవైపు శాసనసభాపతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో శాసనమండలి నుంచి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న విపక్ష గొంతులను అణచివేసేందుకే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సభ లోపల, బయట కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసే వ్యూహంలో భాగంగా రాజ్భవన్లో గవర్నర్తో జరగనున్న ఈ భేటీ రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.









