“పోలీస్ ఉద్యోగాలకు ట్రాన్స్‌జెండర్లు కూడా అర్హులే”: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. భౌతికంగా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశం!

తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్లకు చోటు కల్పించకపోవడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో తమకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ సూర్యాపేట జిల్లాకు చెందిన డి. తనుశ్రీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దరఖాస్తు ఫారాలలో కేవలం స్త్రీ, పురుష లింగాలకే పరిమితమై ‘ఇతరులు’ అనే కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును (TSLPRB) ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. సమాజంలో కేవలం రెండే లింగాలు ఉంటాయనే మూస ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 16తో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతానికి ఆన్‌లైన్ పోర్టల్‌లో థర్డ్ జెండర్ లేదా ఇతరులు అనే ఆప్షన్ లేకపోతే.. అర్హులైన ట్రాన్స్‌జెండర్ల నుంచి భౌతికంగా (ఫిజికల్ మోడ్‌లో) దరఖాస్తులను స్వీకరించి, వారికి వెంటనే రశీదు అందజేయాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులను ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తుచేసింది.

ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ, రాష్ట్ర డీజీపీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు రాజ్యాంగబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంటూ, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో యూనిఫాం సర్వీసుల్లో చేరాలనుకుంటున్న ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు మార్గం సుగమమైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు