విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెలకు చోటు: సీఎం చంద్రబాబు, మంత్రి ఆనంకు కృతజ్ఞతలు!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డులో కీలక స్థానం లభించింది. కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ఆమెను ‘ప్రత్యేక ఆహ్వానితురాలి’గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిష్టాత్మక ఇంద్రకీలాద్రి దేవస్థాన పాలకమండలిలో స్థానం దక్కడంపై సినీ, రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఈ నియామకంపై సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి ఈ పవిత్రమైన బాధ్యతను అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారికి సేవ చేయడానికి, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ దైవిక అవకాశాన్ని ఎంతో వినమ్రతతో స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు.

సుస్మిత కొణిదెలకు దుర్గ గుడి ట్రస్టు బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా చోటు దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సుస్మిత కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు