హర్మూజ్‌లో అమెరికాకు షాక్‌: మానవరహిత సబ్‌మెరైన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ కూల్చివేతతో పతాక స్థాయికి ఉద్రిక్తతలు!

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదిరి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా నిఘా కోసం ఉపయోగిస్తున్న అత్యాధునిక మానవరహిత సబ్‌మెరైన్‌ను (UUV) తమ నేవీ దళాలు క్లిష్టమైన ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న జలాంతర్గామిని ‘డైవ్-ఎల్‌డీ (Dive-LD)’గా పేర్కొంటూ దానికి సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. అంతేకాకుండా, అదే ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది.

ఇరాన్ ప్రకటనపై అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) స్పందిస్తూ.. ప్రాంతీయ జలాల పరిశీలన సమయంలో నీటి అడుగున పనిచేసే తమ డ్రోన్ ఒకటి సాంకేతిక లోపంతో పనిచేయడం ఆగిపోయిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే ఇరాన్ చేజిక్కించుకున్నది అదేనా కాదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. పైగా అది పాత మోడల్ అని, అందులో ఎలాంటి రహస్య సోనార్, రాడార్ పరికరాలు లేవని, కీలక నిఘా సమాచారమేదీ సేకరించలేదని పెంటగాన్ పేర్కొంది. కాగా, సుమారు రూ.21 కోట్ల విలువైన ఈ ‘డైవ్-ఎల్‌డీ’ సబ్‌మెరైన్ దాదాపు 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి, బేస్‌కు తిరిగి రాకుండానే వరుసగా 10 రోజుల పాటు నీటి అడుగున నిఘా కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.

మరోవైపు ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు తీవ్రరూపం దాల్చాయి. గతంలో ఇరాన్ నుంచి జరిగిన దాడులకు బదులుగా ఆ దేశానికి చెందిన ఐదు భారీ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనికితోడు ఇరాన్‌కు చెందిన 27 విమానయాన సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించి ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది. అమెరికా చర్యలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ తమపై జరిగే దాడులను తిప్పికొట్టేందుకు ప్రతిఘటనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు