ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుప్పం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ కేజే భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కుప్పంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం “చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలి” అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థులు రక్తపాతం కోరుకుంటే రక్తాభిషేకం చేసైనా గెలవాలని, ప్రాణాలకు తెగించే వారికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని భరత్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరగడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.
ఎమ్మెల్సీ భరత్ చేసిన ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు కుప్పం నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేశ్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన కుప్పం అర్బన్ పోలీసులు ఎమ్మెల్సీ భరత్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 192, 353(1)(B), 351(2) రెడ్ విత్ 3(5) కింద క్రైమ్ నంబర్ 206/2026తో కేసు నమోదు చేశారు.
మరోవైపు భరత్ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో రక్తపాతం సృష్టిస్తామని మాట్లాడటం వైసీపీ అరాచకత్వానికి పరాకాష్ట అని బీజేపీ, టీడీపీ నాయకులు మండిపడ్డారు. యుద్ధం చేయాలనుకుంటే సరిహద్దులకు వెళ్లాలని, ప్రశాంతంగా ఉండే కుప్పంలో హింసను ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో కుప్పం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Post Views: 22









